టాటా మోటార్స్‌ షాక్‌.. జులై నుంచి పెరగనున్న వాణిజ్య వాహనాల ధరలు!

  • జులై 1 నుంచి టాటా కమర్షియల్‌ వాహనాలు ప్రియం
  • గరిష్ఠంగా 2.5 శాతం వరకు ధరల పెంపు
  • ముడి పదార్థాలు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల ప్రభావం
  • మోడల్‌, వేరియంట్‌ను బట్టి పెంపులో మార్పులు
  • ఇప్పటికే ప్యాసింజర్‌ వాహనాల ధరల్ని పెంచిన టాటా
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ట్రక్కులు, బస్సులు సహా కమర్షియల్‌ వాహనాల శ్రేణిలో గరిష్ఠంగా 2.5 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు నేడు ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ముడి పదార్థాల ధరలు, ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ భారాన్ని కొంత మేర భర్తీ చేసేందుకు ధరల సవరణ చేపడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ధరల పెంపు అన్ని వాహనాలపై ఒకేలా ఉండదని తెలిపింది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి పెరుగుదల మారుతుందని పేర్కొంది.

ఇదే నెల ప్రారంభంలో టాటా మోటార్స్‌ తన ప్యాసింజర్‌ వాహనాల ధరలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్‌ కార్లతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలపై 1.5 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు తెలిపింది. ఆ పెంపు కూడా వచ్చే నెల నుంచే అమల్లోకి రానుంది.

ఇటీవల ముడి పదార్థాల ధరల పెరుగుదల, నిర్వహణ వ్యయాల భారం కారణంగా పలు ఆటో కంపెనీలు ధరలను సవరించాయి. గత నెలలో హ్యుందాయ్‌ తమ వాహనాల ధరలను రూ.12,800 వరకు పెంచగా, మారుతి సుజుకి కూడా ఈ ఏడాది ప్రారంభంలో పలు మోడళ్ల ధరలను పెంచింది.

Tata Motors
Tata Motors price hike
Commercial vehicle prices
Tata passenger vehicles
Automobile price increase
Truck and bus prices

More Telugu News